Arts Blogs - Blog Rankings U70mm: చంద్రుడిపై షికారు!

Thursday, 21 June 2012

చంద్రుడిపై షికారు!


లండన్: వెండి వెన్నెల రేడు చందమామను దగ్గరగా చూడాలనుందా? చంద్రుడి చుట్టూ స్పేస్‌షిప్‌లో చక్కర్లు కొడుతూ పలకరించాలని ఉందా? అయితే మీ కలల్ని నిజం చేస్తామంటున్నారు బ్రిటన్‌కు చెందిన ‘ఎక్స్‌క్యాలిబర్ అల్మాజ్’ అనే ప్రైవేటు కంపెనీవారు. వచ్చే 2015 కల్లా తొలి చంద్ర యాత్రకు తాము శ్రీకారం చుట్టామని బ్రిటన్ రాజకుటుంబం అధీనంలో, స్వయంపాలిత ప్రాంతంగా ఉన్న ‘ఐల్ ఆఫ్ మ్యాన్’కు చెందిన ఆ కంపెనీ ప్రకటించింది. ఈ అంతరిక్ష పర్యాటక యాత్ర కోసం రష్యా నుంచి నాలుగు స్పేస్ షటిల్స్‌ను, రెండు అంతరిక్ష కేంద్రాల్ని తాము కొనుగోలు చేసి, ఆధునీకరించామని మంగళవారం లండన్‌లో జరిగిన సమావేశంలో ఎక్స్‌క్యాలిబర్ వ్యవస్థాపకుడు అర్ట్ డూలా వెల్లడించారు. 

ఈ యాత్రలో భాగంగా పర్యాటకులకు పూర్తిస్థాయి శిక్షణనిస్తారు. రిమోట్‌తో నియంత్రించగల క్యాప్సూల్ (షటిల్)లో ఒక్కో ట్రిప్పులో ముగ్గురిని మాత్రమే పంపిస్తారు. క్యాప్సూల్‌ను తొలుత ‘లో-ఎర్త్ ఆర్బిట్’ (2,000 కి.మీ. కంటే తక్కువ ఎత్తులో గల కక్ష్య)లోకి పంపించి, అక్కడి ఓ అంతరిక్ష కేంద్రానికి క్యాప్సూల్‌ను అనుసంధానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి షటిల్‌ను భూమికి 2,34,000 మైళ్ల దూరంలో గల చంద్రుడి కక్ష్యలోకి పంపించి, చక్కర్లు కొట్టిస్తారు. పర్యటన పూర్తయిన తర్వాత క్యాప్సూల్ తిరిగి వచ్చేసి, పారాచుట్ సాయంతో భూమిపై దిగిపోతుంది. ఈ చంద్ర యాత్ర కోసం అక్షరాలా రూ. 878 కోట్లు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు.

No comments:

Post a Comment