Arts Blogs - Blog Rankings U70mm: రాహుల్ నంబర్-2

Thursday 26 July 2012

రాహుల్ నంబర్-2


న్యూఢిల్లీ సాక్షి ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వంలో నంబర్-2 స్థానాన్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? ఇంతవరకు ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన బాధ్యతలను ఇకపై పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ భుజాలకెత్తుకోనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రణబ్ రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ఖాళీగా మారిన ‘లోక్‌సభ నాయకుడి’ స్థానాన్ని రాహుల్‌తో భర్తీ చేయాలని కోరుతూ తాజాగా 10 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధినేత సోనియాగాంధీకి లేఖ రాశారు. పార్లమెంటులో, పార్టీలో రాహుల్ క్రియాశీలక పాత్ర పోషించే సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు.

లోక్‌సభ నాయకుడిగా రాహుల్ ప్రజాసమస్యలపై ధైర్యంగా మాట్లాడుతూ.. పార్టీ ఎంపీల్లో ఉత్తేజం నింపుతారని వివరించారు. యూపీఏ భాగస్వామ్యపక్షాలను కలుపుకొనిపోతూ ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కొనగలరని అన్నారు. పార్లమెంటు లోపల, బయట పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాహుల్ పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో వివరించారు. ఒడిశా ఎంపీ భక్త చరణ్‌దాస్ రాసిన ఈ లేఖపై మరో తొమ్మిది మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాహుల్‌గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కోరిన విషయం తెలిసిందే.

నంబర్ 2 స్థానానికి మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే పేరుతోపాటు ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. షిండేకు కేంద్ర హోంశాఖను కట్టబెట్టేందుకు యత్నాలు సాగుతున్నాయని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు పార్టీ ఎంపీలు రాహుల్ పేరు తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఆగస్టు 8 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపే లోక్‌సభ నాయకుడి స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది.

No comments:

Post a Comment